ఈసారీ మనదే విజయం.. 100 సీట్లు పక్కా
వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. 100 సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇది ఎన్నికల ఏడాదని, అక్టోబర్ చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించారని అన్నారు. కొత్త రాష్ట్రంలో తలసరి ఆదాయం భారీగా పెరిగిందని తాము చెప్పడం లేదని, మేధావులే చెబుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పలు సభల్లో వెల్లడించారని పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని ఆయన సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలను మార్చేది లేదని, ఇప్పుడున్న వారికే మళ్లీ సీఎం కేసీఆర్ టికెట్లు ఇస్తారని ఆయన పేర్కొన్నారు. వేములవాడ నుంచి ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బరిలో ఉంటారన్నారు. జిల్లాలో సూరమ్మ ప్రాజెక్టు ఒక్కటే పెండిరగ్లో ఉందని, దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని వెల్లడించారు.













