పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన విజయశాంతి

కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న వార్తలపై శనివారం ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని, ఇవన్నీ నిరాధారమైన వార్తలని మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోతుందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత విజయశాంతి ఎక్స్ వేదికగా ఖండించిన విషయం తెలిసిందే. ప్రాంతీయ భావోద్వేగాలనేవి ఎప్పుడూ ప్రజల మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తుంటాయని, ఇది దక్షిణాది రాష్ట్రాల సహజ విధానమని, ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వ సత్యాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు, బీజేపీ కనీసం ఆలోచన చెయ్యలేకపోతోందంటూ కిషన్ రెడ్డికి ఆమె కౌంటర్ ఇచ్చారు. ఈ పోస్ట్‌తో విజయశాంతి మళ్లీ పార్టీ మరుతున్నారంటూ రూమర్లు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీలో సరైన గౌరవం దక్కకపోవడంతో తిరిగి ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలపై విజయశాంతి స్పందించారు.
దక్షిణ భారత ప్రజల రాజకీయ భావోద్వేగాలు ఎలాంటివో ఉదహరిస్తూ దక్షిణాది ప్రాంతీయ పార్టీల పట్ల కాంగ్రెస్ అర్ధం చేసుకునే తీరు, బీజేపీ దండయాత్ర విధానం గురించి వివరించడమే తన పోస్ట్ సారాంశమని విజయశాంతి వివరించారు. అయితే తన పోస్ట్‌ను అర్థం చేసుకోలేని కొందరు దాన్ని వక్రీకరించి తాను పార్టీ మారుతున్నట్లు రాజకీయ వార్తా కథనాలు సృష్టించారని మండిపడ్డారు. అయితే అర్ధం చేసుకునే విధానం ఉన్నవారికి చెప్పవచ్చు కానీ.. ఉద్దేశ్యపూర్వకంగా విమర్శ చేయడమే పనిగా పెట్టుకున్నవాళ్లకు వివరణలు ఇచ్చి ప్రయోజనం లేదని విజయశాంతి విమర్శించారు.