చట్టసభల్లో మహిళలకు స్థానం లేదు : ఉపరాష్ట్రపతి
స్వాతంత్య్రం వచ్చి డెబ్బై ఏళ్లయినా చట్టసభల్లో మహిళలకు సముచిత ప్రాధాన్యం దక్కడం లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ చందానగర్లో మహిళ దక్షత రజతోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ జనాభాలో 50 శాతం మహిళా జనాభా ఉన్న పార్లమెంటులో కేవలం 11.7 శాతం మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారని అన్నారు. స్త్రీలకు సరైన అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఏదైనా ట్రస్ట్ స్థాపించడం కంటే దాన్ని విజయవంతంగా నడపడం గొప్ప విషయమన్నారు. బాలికలు, మహిళల అభ్యున్నతికి 25 ఏళ్లుగా కృషి చేస్తున్న మహిళ దక్షణ సమితి నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఓ మహిళా విద్యావంతురాలైతే ఆ కుటుంబం అంతా బాగుపడుతుందని, దాంతో సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు.













