ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలి : ఉపరాష్ట్రపతి
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేలా అంతర్జాతీయస్థాయిలో కఠినచట్టాలు తేవాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. నల్సార్ న్యాయ యూనివర్సిటీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా (అంతర్జాతీయ న్యాయసంస్థ) 78వ అంతర్జాతీయ న్యాయసమావేశాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రపంచసమస్యగా మారిన టెర్రరిజాన్ని న్యాయపరంగా, పరిపాలనపరంగా, రాజకీయంగా ఎదుర్కోవాల్సి ఉందని అన్నారు. అందుకు అనుగుణంగా అంతర్జాతీయస్థాయిలో న్యాయనిపుణులను సిద్ధం చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
ఉగ్రవాదం ఒక భారతదేశం సమస్యనో లేదా అమెరికా, రష్యా, ఫ్రాన్స్ ఏదో ఒక దేశ సమస్యనో కాదని, ఇది వివిధ కారణాలతో అన్ని దేశాలకు విస్తరిస్తున్నదని అన్నారు. జాతి, రంగు, ప్రాంతం అనే తేడా లేకుండా టెర్రరిజం అణిచివేతపై ప్రపంచం లోని ప్రజలందరూ ఒకే ధోరణి, ఒకే గొంతుకతో వ్యవహరించాలని, టెర్రరిజం మనుగడసాగించేందుకు వీలులేకుండా వనరులను నిలిపివేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. 2011 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అంతర్జాతీయ ఉగ్రవాదంతో భారత దేశం పొరాటం చేస్తున్నదని, ఉగ్రవాదాన్ని అరికట్టడం కోసం సార్క్ కన్వెన్షన్‌తో పాటు భారతదేశం ప్రతిపాదించిన ఒక సమగ్ర కన్వెన్షన్ ఐక్యరాజ్యసమితి పరిశీలనలో ఉందని తెలిపారు.













