అభివృద్ధి మరియు సంక్షేమ ఫలితాలు ప్రతి ఒక్కరికీ అందాలి – ఉపరాష్ట్రపతి
• ప్రజలు మరియు ప్రకృతి హితంగా అభివృద్ధి ఉండాలి
• సమాజహిత అభివృద్ధి భావనను పాఠశాల స్థాయి నుంచే ప్రోత్సహించాలి
• అభివృద్ధి కోసం 5 “పి”లను సూచించిన శ్రీనాయుడు
• అభివృద్ధిలో గ్రామాలను అంతర్భాగం చేయాలి
• హైదరాబాద్ లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ డెవలప్ మెంట్ డిస్కోర్స్ కార్యక్రమంలో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి
అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ అందాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. సామాజిక అభివృద్ధితో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలిపారు. హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రాంగణంలో ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ (EFLU), రీసెర్చ్ ఫర్ రీసర్జెన్స్ ఫౌండేషన్ (RFRF) మరియు ఇతర సంస్థల సహకారంతో నిర్వహించిన “ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ డెవలప్ మెంట్ డిస్కోర్స్” కార్యక్రమంలో ఆయన ప్రసంగించిన ఆయన, ప్రజలు మరియు ప్రకృతికి మేలు చేసేదిగా అభివృద్ధి ఉండాలని ఆకాంక్షించారు. అంతకంటే ముందు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ (EFLU) వజ్రోత్సవాల సందర్భంగా నిర్మించిన స్మారకాన్ని(పైలాన్) ఆయన ఆవిష్కరించారు.
జనాభాలో ఇప్పటికీ 18 నుంచి 20 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన జీవించడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు రంగాలకు చెందిన సంస్థలు దారిద్ర్య నిర్మూలనుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పేదరిక నిర్మూలకు అవసరమైన అన్ని రకాల ప్రయత్నాల్లో భాగస్వాములు కావాలని తెలిపారు. ప్రకృతితో కలిసి జీవించడం భారతీయ సంస్కృతిలో ఉందన్న ఉపరాష్ట్రపతి, మన పెద్దలు మన సంప్రదాయాల్లో, ఆరాధనలో ప్రకృతికి ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు. పర్యావరణ హితంలోనే సమగ్రమైన అభివృద్ధి ఉందని, పాఠశాల స్థాయి నుంచే ప్రకృతికి మేలు చేసే విధంగా, మానవ పురోభివృద్ధికి సహకరించే విధంగా స్థిరమైన అభివృద్ధి భావనను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ప్రతి అభివృద్ధి ప్రణాళిక పరిపూర్ణం అయ్యేందుకు ఐదు “పి”లను దృష్టిలో పెట్టుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. పీపుల్ (ప్రజలు), ప్రాస్పరిటి (శ్రేయస్సు), ప్లానెట్ (భూగ్రహం), పీస్ (శాంతి) మరియు పార్ట్నర్ షిఫ్ (భాగస్వామ్యం) అనే ఐదు అంశాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి మార్గంలో ముందుకు పోవాలని సూచించారు.
జిడిపి, వినియోగం, మానవ అభివృద్ధి, ఆదాయ స్థాయి, పేదరిక నిర్మూలన, సామాజిక అభివృద్ధి మరియు పాశ్చాత్యీకరణ లాంటి అనేక భావనలతో అభివృద్ధి ముడిపడి ఉంటుందన్న ఉపరాష్ట్రపతి, స్థిరమైన ఆర్థికవృద్ధి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. విధాన నిర్ణేతలు మరియు ప్రణాళికలకు రూపకల్పన చేసే వారు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల అభివృద్ధిని ఈ ప్రక్రియలో అంతర్భాగం చేయాలని తెలిపారు. పేదరిక నిర్మూలనలో భాగంగా, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, రైతుల ఆదాయాన్ని మెరుగు పరడం, గ్రామాలు పట్టణాల మధ్య అంతరాన్ని తొలగించడం, వాతావరణ మార్పుల వల్ల ఎదురౌతున్న సమస్యలను పరిష్కరించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని నియంత్రణలో ఉంచడం, మహిళా సాధికారతను సాకారం చేయడం, స్థిరమైన వృద్ధి దిశగా పయనించే ఉద్యోగాల కల్పన లాంటి అంశాల మీద దృష్టి నిలిపి ముందుకు సాగాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న వేగం స్థిరంగా ఉండడంతో పాటు, ప్రజల శ్రేయస్సు మరియు అబివృద్ధి కోసం వాటిని వినియోగించడం అవసరమని శ్రీ నాయుడు తెలిపారు. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవితాల్లో వేగవంతమైన పురోగతి దేశాభివృద్ధికి సూచిక అని తెలిపిన ఉపరాష్ట్రపతి, దేశంలో పేదరికం, నిరక్షరాస్యత, కుల-లింగ వివక్షలు, నల్లధనం, ఉగ్రవాదం వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు కృషి చేయడం ద్వారా వేగవంతమైన పురోగతి సాధించవచ్చని పేర్కొన్నారు.













