ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి
దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతిని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకుంటున్నానని తెలిపారు. ఖైతరాబాద్ గణేషుడు దర్శనం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. దేశం అన్ని రంగాల్లో ముందుండాలని వేడుకున్నానని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా చేయాలని ప్రార్థించానన్నారు.
దేశంలోని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని అన్నారు. ఒక కార్యక్రమం విజయవంతం కావాలంటే గణపతి పూజిస్తామని చెప్పారు. ఏ కార్యక్రమమైనా ఆటంకం లేకుండా సాగాలంటే గణపతిని పూజిస్తామన్నారు. అందరిపైనా భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని అన్నారు. ఆయన వెంట మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, తదితరులు ఉన్నారు. ఉప రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.













