మన సంస్కృతిని కాపాడుకుందాం – ఉపరాష్ట్రపతి
• ఉత్సవాన్ని నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్రప్రభుత్వానికి అభినందనలు తెలిపిన శ్రీ నాయుడు
• ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి
• సుకేశముని సూపశాస్త్రాన్ని ఉదహరించిన ఉపరాష్ట్రపతి
భారతీయ సంస్కృతి ఎంతో ఉన్నతమైనదని, ఇలాంటి సంస్కతిని కాపాడుకోవలసిన బాధ్యత మనందరికీ ఉందని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు అభిప్రాయ పడ్డారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన కైట్స్ మరియు స్వీట్స్ ఇంటర్నేషన్ ఫెస్టివల్ కు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఇలాంటి పండుగల ద్వారా అందరూ ఒకే చోటకు చేరుకోవడం, అభిప్రాయలను పంచుకోవడం సాధ్యమౌతుందని తెలిపారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఉపరాష్ట్రపతి, ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో కొత్త కాంతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలు సంప్రదాయాలను మరచిపోకుండా, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఈ కార్యక్రమాల వెనుక సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు.
మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన మూలం నేలేనని తెలియజేసే భావనలు గాలి పటం ఎగరేయడంలో కనిపిస్తాయని, ఇలాంటి పండుగలు ప్రతి ఒక్కరికీ ఉత్సాహంతో పాటు స్ఫూర్తిని అందిస్తాయని ఉపరాష్ట్రపతి అన్నారు. క్రీడల వల్ల సహనం కూడా పెరుగుతుందని, అలాంటి సహనాన్ని పరిపూర్ణంగా అందించే గాలి పటాలు ఎగరేసే లాంటి పండుగలు మానసిక ఆరోగ్యాన్ని పెంచుతాయన్నారు.
మంచిని కోరుతూ తీపిని పంచడం మన సంప్రదాయమని, అంతర్జాతీయంగా వివిధ దేశాల వారికి మనవైన తీపిరుచులను పరిచయం చేసే అంతర్జాతీయ స్వీట్స్ ఉత్సవం, వారి రుచుల్లో ఉండే గొప్పతనాన్ని ఆస్వాదించే ఆస్కారం కల్పిస్తాయని తెలిపారు. భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ వెనుక ఓ కారణం, ప్రతి సంప్రదాయం వెనుక ఓ విశేషం ఉంటుందని తెలిపిన ఉపరాష్ట్రపతి, ఐకమత్యానికి చిహ్నంగా నిలిచే కైట్స్ ఫెస్టివల్, స్వీట్స్ ఫెస్టివల్ లాంటి పండుగలకు అన్ని ప్రభుత్వాలు ప్రోత్సాహాన్ని అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మన జీవనానికి ఆహారం మూలమని, సరైన ఆహారం ద్వారా ఆరోగ్యం ఆయుష్షు రెండూ పెరుగుతాయని భారతీయ ఆహారం కాల పరీక్షలకు నిలబడిందని, మనదైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.
నలుడు, భీముడు మొదలుకుని భారతీయుల్లో పాకశాస్త్ర ప్రావీణ్యులు ఎంతో మంది ఉన్నారని, మన దేశంలో ఎన్నో ప్రామాణిక శాస్త్రాలు పుట్టాయని, అన్ని రకాల వంటల గురించి, అవి తినడం వల్ల కలిగే లాభాల గురించి సుకేశ ముని రచించిన సూప శాస్త్రం గురించి ఉపరాష్ట్రపతి తెలిపారు. మంచి ఎక్కడ ఉన్నా తీసుకోవడంలో తప్పు లేదని, అదే సమయంలో మనవైన ఆహారాన్ని, అలవాట్లను, సంప్రదాయలను వదలి పాశ్చాత్య సంస్కృతి వైపు పరుగులెత్తడం మంచి పద్ధతి కాదని ఉపరాష్ట్రపతి తెలిపారు.
ఈ కార్యక్రమానికి తెంలగాణ మండలి ఛైర్మన్ శ్రీ స్వామి గౌడ్, తెలంగాణ హోంమంత్రి శ్రీ మహమూద్ అలీ, సాంస్కృతిక శాఖ అధ్యక్షులు శ్రీ మామిడి హరికృష్ణ తదితరులు హాజరయ్యారు.













