తెలుగులో పంచకావ్యాలు… ఉపరాష్ట్రపతి ప్రశంస
తెలుగు భాషలోని తియ్యందనాల్నీ గొప్పదనాన్నీ తెలుసుకోవాలంటే మన ప్రాచీన కవులు మనకు మిగిల్చిపోయిన గొప్ప సాహిత్య సంపదని కొంతైనా చదివి అర్థం చేసుకోవాలి. సంస్కృత భాషలో పంచకావ్యాలు ఉన్నట్లుగా మన తెలుగు కవులు కూడా అద్భుతమైన కావ్యసృష్టి చేశారు. అల్లసాని పెద్దన్న గారు వ్రాసిన, మనుచరిత్రము, నందితిమ్మన వ్రాసిన పారిజాతాపహరణము, తెనాలి రామకృష్ణ కవి వ్రాసిన పాండురంగ మాహాత్మ్యము, భట్టుమూర్తి వసుచరిత్రము, శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద తెలుగులో పంచకావ్యాలన్న గౌరవం సంపాదించుకున్నాయి.
ఇంతటి మహత్తరమైన కావ్యాలు ఈనాటి ఆంగ్లమాధ్యమంలో చదువుకున్న తెలుగు పాఠకులకు అర్థంకానంత దూరానికి జరిగిపోయాయి. ఆలోటును తీర్చటానికి తెలుగులో అక్షరజ్ఞానమున్న పాఠకులకు అర్థమయ్యేలా, పాఠకమిత్ర శైలిలో పంచకావ్య పరిచయ గ్రంథాల్ని సుప్రసిద్ధ రచయిత, విశ్లేషకులు, భాషాసేవకులు, శ్రీ బాలాంత్రపు వేంకట రమణ అందించారు. ఈ పుస్తకాలను ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు గారికి బహుకరించినప్పుడు ఆయన పుస్తకాలను చూసి ప్రశంసించారు. ఈ పుస్తకాలు కావాల్సినవారు అచ్చంగా తెలుగు ప్రచురణలకర్తల నుంచి పొందవచ్చు.
Click here for Photogallery













