మనం లేకుంటే సిలికాన్ వ్యాలీ లేదు
ఇతర దేశస్థుల వీసాల గురించి అమెరికా అధ్యక్షుడు ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ దేశం అభివృద్ధిలో ఇతర దేశాలు ముఖ్యంగా భారత్ భాగస్వామ్యం ఎంతో ఉంది. ఆయన అనుకున్నట్లుగా జరిగితే భవిష్యత్తులో అమెరికా అధిపత్యం కొనసాగదు. అది పేద దేశంగా మారుతుంది అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. సిలికాన్ వ్యాలీలో ప్రతి ఇద్దరిలో ఒక భారతీయుడు, అందులోనూ దక్షిణాది రాష్ట్రానికి చెందిన వారే కనిపిస్తారని, వారిని పంపిస్తే సిలికాన్వ్యాలీనే ఉండదని అన్నారు. ఐటీ రంగం వల్లే హైదరాబాద్ పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతోందని తెలిపారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్స్ అసోసియేషన్ (హైసియా), సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) సంయుక్త ఆధ్వర్యంలో హైసియా సమ్మిట్ -2018ను హెచ్ఐసీసీ నోవాటెల్లో జరిగింది. అత్యుత్తమ పనితీరు కనబర్చిన సాఫ్ట్వేర్ కంపెనీలకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తమ వ్యక్తిత్వం, విలువలతో కూడిన రాజకీయాల స్థానాన్ని కుల, మత, ధన, నేర రాజకీయాలు ఆక్రమించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో హైసియా అధ్యక్షుడు మురళి బొల్లు, ఎస్టీపీఐ హైదరాబాద్ డైరెక్టర్ రాంప్రసాద్, ఐటీ కంపెనీలు, స్టార్టప్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.













