తండ్రికి తగ్గ తనయుడు హరికృష్ణ : ఉపరాష్ట్రపతి
సినీ నటుడు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ దుర్మరణం చాలా విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మెహదీపట్నంలోని నివాసంలో హరికృష్ణ భౌతికకాయానికి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. నందమూరి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తండ్రికి తగిన తనయుడిగా హరికృష్ణ అచంచల ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి అని తెలిపారు. ఆయన నిర్భీతిగా, నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరించేవారన్నారు. ఏ పనైనా చిత్తశుద్ధితో చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి హరికృష్ణ అని పేర్కొన్నారు. ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవారని వెంకయ్య గుర్తు చేసుకున్నారు. గతంలో రాజ్యసభలో తెలుగులోనే మాట్లాడుతానని గట్టిగా చెప్పారని, ఆనాటి చైర్మన్ అభ్యంతరం తెలిపితే నేను జోక్యం చేసుకుని తర్జుమా చేస్తానని చెప్పినట్లు వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. సినీ, రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత సంతరించుకున్నారని కొనియాడారు. హరికృష్ణకు ప్రజాభిమానం మెండుగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిసున్నట్లు పేర్కొన్నారు.













