వారిని వాటికి దూరంగా ఉంచాలి : వెంకయ్యనాయుడు

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చిన్నారులకు విద్యార్థి దశ నుంచే అలవాటు చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. కాకర్ల సుబ్బారావు శతజయంతి వేడుకల్లో భాగంగా మాదాపూర్ శిల్పకళా వేదికపై ఇంటర్నేషనల్ స్కూల్ షేక్‌పేట్ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కిమ్స్ ఆసుపత్రి వ్యవస్థాపకులు భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ చిన్నారులు ఫోన్లలకు అలవాటు పడి మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని, వారిని వాటికి దూరంగా ఉంచాలన్నారు. చిన్నారులకు ఏం నేర్పిస్తామో వాటినే అలవాటు చేసుకుంటారని చెప్పారు. ప్రస్తుతం విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉందన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అకట్టుకున్నాయి. కాకర్ల సుబ్బారావు వైద్య రంగంలో చేసిన కృషిని వివరిస్తూ విద్యార్థులు నాటికను ప్రదర్శించారు.