ఆర్ఆర్ఆర్ పై సాఫీగా ప్రయాణం
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్)పై వెళ్లేందుకు అన్ని వాహనాలకు అనుమతి ఇవ్వబోతున్నారు. ఎక్స్ ప్రెస్‌వే అయినప్పటికీ బస్సులు, కార్లే కాకుండా ఆటోలు, ద్విచక్రవాహనాలు, చివరకు ఎడ్ల బండ్లు సైతం దీని మీదుగా వెళ్లేందుకు వెసులుబాటు కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగురోడ్డు, అలాగే విమానాశ్రయానికి ప్రత్యేకంగా నగరం నుంచి శంషాబాద్ వరకు నిర్మించిన పీవీ నరసింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేల మీద ద్విచక్రవాహనాలు, ఆటోలు లాంటి చిన్న వాహనాలకు అనుమతి లేని విషయం తెలిసిందే.ఈ రెండిరటి లాగే ఆర్ఆర్ఆర్ కూడా ఎక్స్‌ప్రెస్ వేగా నాలుగు వరుసల్లో రూపుదిద్దుకోనున్నప్పటికీ అన్ని వాహనాలూ వెళ్లేందుకు అనుమతించనున్నారు.
సాధారణంగా ఎక్స్‌ప్రెస్ వేలకు సర్వీసు రోడ్లను నిర్మిస్తారు. ఇప్పుడు నిర్మించే ప్రధాన జాతీయ రహదారులకు కూడా సర్వీసు రోడ్లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పీవీ ఎక్స్‌ప్రెస్‌వే ఫ్లైఓవర్ (ఎలివేటెడ్ కారిడార్)గా నిర్మించినందున దానికి సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయలేదు. అలాగే ఆర్ఆర్ఆర్కు కూడా సర్వీసు రోడ్డు ఉండదని తెలుస్తోంది. దీన్ని జాతీయ రహదారిగా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
దాదాపు 335 కి.మీ. నిడివితో కూడిన ఈ రోడ్డుకు దాదాపు రూ.18 వేల కోట్లకుపైగా ఖర్చు కానుంది. కాగా దీని నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం మొదట్నుంచీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోడ్డును 8 వరుసలుగా నిర్మించాల్సి ఉన్నా, ప్రస్తుతానికి 4 వరుసలు సరిపోతాయని ఇప్పటికే నిర్ధారించారు. తాజాగా దీని వ్యయంపై ఢల్లీిలో జరిగిన సమావేశంలో చర్చించారు. ప్రస్తుతానికి ఉత్తర భాగాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. వీలైనంత వరకు ఖర్చును నియంత్రణలో ఉంచుకోవాలని ఢల్లీిలోని ఎన్హెచ్ఏఐ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే సర్వీసు రోడ్ల ప్రతిపాదన తొలగించారు. అయితే సర్వీసు రోడ్లు లేకుంటే స్థానికులు ఎక్కువగా వినియోగించే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు లాంటివి ఎక్స్‌ప్రెవే పైకి ఎక్కేందుకు వీలుండదు. అలాంటప్పుడు స్థానికులు భూములు ఇచ్చేందుకు అంగీకరించరు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఎక్స్‌ప్రెస్ వే అయినప్పటికీ, సాధారణ జాతీయ రహదారుల మీదకు అన్ని వాహనాలను అనుమతిస్తున్నట్టే దీని మీదకు కూడా అనుతించటం ద్వారా సర్వీసు రోడ్ల అవసరం లేకుండా చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.













