సింగరేణి ఏమైనా వరల్డ్ కప్పా?
సింగరేణి ఎన్నికల గెలుపును ముఖ్యమంత్రి కేసీఆర్ వరల్డ్‌కప్ గెలిచినట్లుగా భావిస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతురావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూతురిని గెలిపించాలని కేసీఆర్ ఆ ఎన్నికల్లో నేరుగా జోక్యం చేసుకున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్ఎస్కు, తమకు నాలుగు వేల ఓట్ల తేడా మాత్రమేనని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో శ్రీకాంత్ చారి తల్లిని ఓడించింది కేసీఆర్‌నని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్‌ను వాడుకుని ఇప్పుడు ఆయన గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. కేసీఆర్ మాట్లాడే భాష సరైంది కాదన్నారు. ఆయనకు మైండ్ దారి తప్పినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. అందుకే కేసీఆర్ ఇష్టమెచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పారు కాబట్టే కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నామని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దొర అయితే సైన్యంలో పనిచేసే వారు కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ని పొగడడమే గవర్నర్ పనిగా పెట్టుకున్నారని, గవర్నర్ ఓ టీఆర్ఎస్ కార్యకర్తలా మాట్లాడుతున్నారని విమర్శించారు.













