గవర్నర్ కూడా బాధలు చెప్పుకుంటే .. తాము ఇంకెవరికి
గురుకుల హాస్టల్స్ చాలా వరకు కిరాయి బిల్డింగ్స్‌లో నడుస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హాస్టల్స్‌లో విద్యార్థులకు సరైన భోజనం పెట్టడం లేదని, వసతులు సరిగాలేక కొన్ని హాస్టల్స్‌లో విష జ్వరాలు వస్తున్నాయన్నారు. హాస్టల్స్‌లో పాములు కుట్టి, ఎలుకలు కరిచి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణ నంబర్ వన్ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. గవర్నర్ కూడా ఆమె బాధలు చెప్పుకుంటే తాము ఇంకెవరికి చెప్పుకోవాలన్నారు. తమిళిసై ప్రజా దర్బార్ అంటున్నారు. మరోవైపు నిరాశ నిస్పృహతో మాట్లాడుతున్నారని, గవర్నర్ లేఖలు రాస్తే పని కాదన్నారు.
అవినీతికి పాల్పడిన సీఎం కేసీఆర్‌ను జైల్లో పెడతామని అంటున్నారు. అనడమే తప్పా చేయడం లేదని విమర్శించారు. గవర్నర్, ప్రభుత్వం తగాదాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు గురుకుల హాస్టల్స్‌ను సందర్శిస్తారని తెలిపారు.













