తెలంగాణలో జరిగిన అవమానం ఏపీ ప్రజలకు తెలియాలి
తెలంగాణలో అంబేద్కర్‌కు జరిగిన అవమానాల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడ తెలియాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్‌కు జరిగిన అవమానాల గురించి ఏపీ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తీరుపై కూడా వీహెచ్ ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం ఓవరాక్షన్ చేస్తోందని, ఇష్టానుసారం అధికారులను బదిలీ చేస్తూ వారి ఆత్మస్థైరాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు. బీజేపీ పెద్దలు ఎవరిపై దాడి చేయమంటే.. వారిపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారని, దేశంలో అన్ని వ్యవస్థలనూ మోదీ ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని ఆరోపించారు.













