ఎంపీ పదవికి ఉత్తమ్ రాజీనామా
తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. తన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లిన ఆయన 10 జన్‌పథ్‌లో సోనియా గాంధీని కలిశారు. అనంతరం అక్కడి నుంచి పార్లమెంట్‌కు వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా ఎన్నికైన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన తన ఎంపీ పదవికీ రాజీనామా చేశారు.













