అది ఎప్పుడనేది త్వరలో వెల్లడిస్తా : ఉత్తమ్
తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఎవరి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించినా తనకు ఆమోదమేనని ఆ పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ వెళ్లి ఆయన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. సీఎం అభ్యర్థి ఎంపిక సహా మంత్రివర్గ కూర్పుపై ఇంకా స్పష్టత రాని నేపథ్యంలో డీకేతో ఉత్తమ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ సీఎం అభ్యర్థిని ఏఐసీసీ అద్యక్షుడు ఖరారు చేస్తారని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హుజూర్నగర్ ఎమ్మెల్యేగానూ గెలుపొందిన నేపథ్యంలో ఎంపీ పదవికి తాను రాజీనామా చేస్తానన్నారు. అది ఎప్పుడనేది త్వరలో నిర్ణయించి వెల్లడిస్తానని చెప్పారు.













