రైతుబంధు పై అమెరికా వర్సిటీ అధ్యయనం!
తెలంగాణ రాష్ట్రంలో వానకాలం పంట నుంచి అమలుకానున్న రైతుబంధు పథకం అన్నదాత ఆర్థిక స్థితిగతుల్లో ఎలాంటి మార్పులను తీసుకురానున్నదనే అంశంపై అమెరికాకు చెందిన ఓ యూనివర్సిటీ ప్రైవేట్ పరిశోధన సంస్థ మూల్యాంకనం చేపట్టనున్నది. మే 10 నుంచి చెక్కుల పంపిణీ మొదలైన రోజు నుంచి హైఫ్రీక్వెన్సీ మానిటరింగ్ ఇంపాక్ట్ ఎవల్యూషన్ (ఉన్నతస్థాయి పర్యవేక్షణ ప్రభావ మూల్యాంకనం) చేయనున్నది. రాష్ట్రంలో ఎంపిక చేసిన 120 మండలాల్లోని వ్వవసాయాధికారులు, రైతులతో మసాచుసెట్స్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి)కి చెందిన ఆర్థిక పరిశోధన విభాగం ఈ పథకంపై సర్వే చేయనున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ముందుగా అధికారస్థాయిలో చెక్కుల పంపిణీపై పర్యవేక్షణ, తర్వాత పథకం రైతుల్లో ఎటువంటి మార్పులు తీసుకొచ్చిందో మూల్యాకనం చేయనున్నారు. ముందుగా 120 మండలాల వ్యవసాయాధికారులకు సమాచారం ఇచ్చి, కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఇందుకు పరిశోధన సంస్థ కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసుకోనున్నది.













