తెలంగాణకు అమెరికా వర్సిటీలు!
తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలకు చెందిన ప్రైవేట్ యూనివర్సిటీలతో పాటు అమెరికాకు చెందిన వర్సిటీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. అమెరికాకు చెందిన జార్జియా టెక్ యూనివర్సిటీతో పాటు యూఎస్‌కు చెందిన మరో ప్రముఖ వర్సిటీ ఇక్కడ యూనివర్సిటీని నెలకొల్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సుమారు 200 నుంచి 300 ఎకరాల్లో విశాల ప్రాంగణంలో యూనివర్సిటీని నెలకొల్పాలని ఆయా వర్సిటీలు భావిస్తున్నట్లు తెలిసింది. అందుకోసం హైదరాబాద్ నగర సమీపంలో అందుబాటులో ఉన్న స్థలం కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. గత మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుకు రాష్ట్ర సభలు ఆమోదం తెలిపాయి ఇటీవల ఉన్నత విద్యామండలి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలతో కూడిన నివేదిక సమర్పించింది. త్వరలో ప్రైవేట్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రముఖ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. ప్రైవేట్ వర్సిటీ ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంగణం, ఏఏ కోర్సులు నిర్వహించాలనే అనే అంశాలపై ఆయా సంస్థలు దృష్టి సారించినట్లు తెలిసింది. రిలయన్స్, మహీంద్ర, అదాని గ్రూప్‌లకు చెందిన ప్రముఖ సంస్థలు ఆసక్తి కబరుస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో వివిధ కోర్సులు అందిస్తున్న ఎనిమిది ఇతర రాష్ట్రాలకు చెందిన ఆఫ్ క్యాంపస్ యూనివర్సిటీలకు ఉన్నత విద్యామండలి నోటీసులు జారీ చేసింది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఎఐసిటిఇ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి)తో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఒసి) తదితర అవసరమైన అనుమతులు పొందకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీలు కొనసాగుతున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర భూభాగంలో ఆఫ్ క్యాంపస్‌లు నడిపిస్తున్న గీతం, సింబయాసిస్, అమిటీ, కె.ఎల్. యూనివర్సిటీ, ఐసిఎఫ్ఎఐ తదితర డీమ్డ్ వర్సిటీలకు ఈ నెల 18న నోటీసులు జారీ చేశారు. అందులో కొన్ని వర్సిటీలు ఇప్పటికే తమకు కలిగిన అనుమతుల పత్రాలను సమర్పించగా, మరికొన్ని కొంత సమయం కావాలని కోరుతున్నట్లు తెలిసింది.













