హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ మార్పు
హైదరాబాద్ నగరంలోని యూఎస్ కాన్సులేట్ మారింది. ఇంతకాలం బేగంపేటలోని పైఘా ప్యాలెస్‌లో ఉన్న ఈ కార్యాలయాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోకి మార్చారు. ఈ విషయాన్ని యూఎస్ కాన్సులేట్ అధికారులు వెల్లడించారు. తొలిసారిగా 2008లో యూఎస్ కాన్సులేట్‌ను ప్రారంభించామని, 14 ఏళ్లపాటు పైఘా ప్యాలెస్‌పై ఎగిరిన అమెరికా జెండా ఇక నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఎగురుతుందని కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ తెలిపారు. భారత్, అమెరికా భాగస్వామ్యంలో ఈ ప్రాంతం ఎంతో కీలకమని భావించినందువల్లనే ఇక్కడ యూఎస్ కాన్సులేట్ ప్రారంభించినట్లు ఆమె చెప్పారు. ఇప్పటికీ తాము అదే నమ్ముతున్నామని అందుకే సైబరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 300 మిలియన్ డాలర్ల విలువైన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీలోకి మారుతున్నామని చెప్పారు. ఇక్కడ ఉద్యోగుల కోసం 255 డెస్కులు, వీసా మరియు పాస్‌పోర్టు సర్వీసుల అందించే 55 విండోలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.













