డీజీపీని అభినందించిన అమెరికా కాన్సుల్ జనరల్
ఇటీవల ముగిసిన అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు కోసం చేసిన బందోబస్తు ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ కాథరిన్ బి హడ్డా తెలంగాణ డీజీపీని అభినందించారు. ఆమె ఇతర అధికారులతో కలిసి డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిశారు. సదస్సు విజయవంతం కావడానికి పోలీసు అధికారులు నిర్విరామంగా కృషి చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా అమెరికా ప్రభుత్వం తరపున పంపిన మెమొంటోను ఆమె డీజీపీకి బహుకరించారు. నాణెం రూపంలో ఉన్న ఈ మెమొంటోకు ఓ వైపు చార్మినార్, మరో వైపు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం చిత్రాలను ముద్రించారు. ఈ కార్యక్రమంలో కాన్సుల్ కార్యాలయ అదికారులతోపాటు శాంతిభద్రతల అదనపు డీజీ అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.













