ఆ రెండు పార్టీలు ఒక్కటే.. బీజేపీ అధికారంలోకి రాగానే ఘనంగా : యోగి ఆదిత్యనాథ్
బీఆర్ఎస్, కాంగ్రెస్ అజెండా ఒక్కటేనని, వ్యక్తిగత అభివృద్ధి కోసమే ఆ పార్టీలు పని చేస్తాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వేములవాడలో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉంటే కరోనా వ్యాక్సిన్, పేదలకు ఉచితంగా బియ్యం ఇచ్చేదా? అని ప్రశ్నించారు. ఎంఐఎంకు భయపడటం వల్లే సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని, బీజేపీ అధికారంలోకి రాగానే ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇక్కడి పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి. దీనికి నిదర్శనమే ముస్లిం రిజర్వేషన్లు. బీజేపీని గెలిపిస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి, ఆ ఫలాలు వెనకబడిన వర్గాలకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్‌తో రాష్ట్రం ఏర్పడితే, కేసీఆర్ ప్రభుత్వం ఏ డిమాండ్‌నూ నెరవేర్చలేకపోయింది. యూపీలో కూడా 2017 కంటే ముందు ఇలాంటి పరిస్థితి ఉండేది. అక్కడున్న యువకులు, నిరుద్యోగులు అప్పట్లో ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల వచ్చాయి. ఆరేళ్లలో అక్కడ ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించాం. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ ఇంజిన్ స్పీడుతో ఉపాధి, శాంతిభద్రతలు కల్పించడం అని అన్నారు. మోదీ ప్రధాని అయ్యాక అంతర్జాతీయంగా భారతదేశం తలెత్తుకునే స్థాయికి ఎదిగిందని అన్నారు. తాను ఇచ్చిన హామీలను నెరవేర్చని స్థితిలో ఉన్నందునే పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా కేసీఆర్ మార్చుకున్నారని విమర్శించారు. వేములవాడ బీజేపీ అభ్యర్థి వికాస్‌రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను యోగీ కోరారు.













