ప్రధాని మోదీ మార్గదర్శనంలో దేశం దూసుకుపోతోంది: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
కేంద్ర ప్రభుత్వంలో బొగ్గు గనులు, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న ప్రహ్లాద్ జోషి తెలంగాణకు వచ్చారు. జనగామ జిల్లాలో పర్యటించిన ఆయన.. కొత్త ఓటర్లుగా నమోదు చేసుకున్న వారిని కలిసి ముచ్చటించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో వేగంగా దూసుకుపోతోందని, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 11 స్థానంలో ఉండే భారత్ ఇప్పుడు ఐదో స్థాయికి చేరుకుందని తెలిపారు. రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో.. అక్కడ చిక్కుకున్న 21 వేల మంది భారతీయ విద్యార్థులను మన దేశానికి తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోదీదే అని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం గురించి ప్రస్తావించిన ఆయన.. మోదీ హయాంలో వచ్చిన 5G స్పెక్ట్రమ్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పారు. అనంతరం కొత్త ఓటర్లంతా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు.













