ఈ అవకాశాన్ని కేవలం తెలంగాణకు మాత్రమే ఇచ్చాం : కేంద్రం
తెలంగాణ ప్రభుత్వం రైతులను అయోమయానికి గురిచేస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గత రబీలో అదనంగా 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనేందుకు సీఎం కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని స్పష్టం చేశారు. ఉప్పుడు బియ్యాన్ని అదనంగా తీసుకునేందుకు కూడా కేంద్ర అంగీకరించిందని తెలిపారు. ఈ అవకాశాన్ని కేవలం తెలంగాణ కు మాత్రమే ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యాన్ని ఎఫ్సీఐకి తరలించలేదని మండిపడ్డారు. గత ఐదేళ్లలో ధాన్యం సేకరణ మూడు రెట్లు పెరిగిందన్నారు. ఇచ్చే ధరను కూడా 1.5 రెట్లు పెంచినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. రా రైస్ ఎంత ఇచ్చినా కేంద్రం తీసుకుంటుందని గతంలోనే సృష్టం చేశామన్నారు. రైతుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారన్నారు. కేంద్రంపై అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.













