ఆ రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటే
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలేనని, ఆ రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో నిర్వహించి మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరు ఎవరికీ బీ టీమో అందరికి తెలుసని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఇటీవల విపక్ష నేతలతోనూ అఖిలేశ్ భేటీ అయ్యారు. వీరిద్దరి తాజా భేటీ చూస్తే ఎవరు ఎవరికి బీ టీమో తెలుస్తుంది అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ గతంలో పొత్తులు పెట్టుకున్నాయని, బీజేపీ మాత్రం బీఆర్ఎస్తో కలిసి ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి పారిపోయిన వ్యక్తి రాహుల్ గాంధీ అని ఎద్దేవా చేశారు. బీజేపీని విమర్శించే నైతిక అర్హత ఆయనకు లేదన్నారు. బీజేపీకి కాంగ్రెస్ ఎంత దూరమో, బీఆర్ఎస్ కూడా అంతే దూరమని వ్యాఖ్యానించారు. మేం గతంలో బీఆర్ఎస్తో కలవలేదు. భవిష్యత్‌లోనూ కలవబోం. కుటుంబపాలన, అవినీతిపై బీజేపీ పోరాటం కొనసాగుతుంది అని అన్నారు.













