ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కచ్చితంగా అమలు : కిషన్ రెడ్డి
వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని, మళ్లీ నరేంద్ర మోదీనే ప్రధాని అవుతారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను కిషన్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్, ఇతర అధికారులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని హోదాలో మోదీ నగరానికి వచ్చి, అత్యాధునిక సదుపాయాలతో సిద్ధమవుతోన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తారన్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కచ్చితంగా అమలు చేస్తారని తెలిపారు. గతేడాది ఏప్రిల్లో ప్రధాని మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. అవి శరవేగంగా జరుగుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాల కల్పనే లక్ష్యంగా కొనసాగుతున్నాయి. 2025 చివరి నాటికి పనులు పూర్తవుతాయి. పూర్తిగా విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటుంది. చర్లపల్లి టెర్నినల్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం అని తెలిపారు.













