వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శన ప్రారంభం
పౌర విమానయాన రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, గత రెండేళ్లలో ప్రయాణికుల సంఖ్య 20 మిలియన్లు పెరిగిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అందుకు తగ్గ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ 2047 నాటికి విమానయాన రంగం 20 ట్రిలియన్ డాలర్ల వృద్ధిని సాధించే దిశగా ముందుకు వెళ్తున్నాం. పదేళ్లలో ఎంతో ప్రగతి సాధించాం. ముంబయి, ఢిల్లీలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులు అందుబాటులోకి తీసుకొచ్చాం అన్నారు. ఉడాన్ పథకం కింద జమ్మూకశ్మీర్లో హెలికాప్టర్ ప్రయాణాలు అమలు చేస్తున్నాం. డ్రోన్లకు డిమాండ్ పెరగడంతో మహిళా పైలట్లను తీర్చిదిద్దుతున్నాం. పౌర విమానయాన చరిత్రలో ఇది నిలిచిపోయే రోజు. అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యధిక ఎయిర్క్రాప్ట్లను కొనుగోలు చేస్తోంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎంతో ముందుకు దూసుకుపోతున్నాం. సాధారణ పౌరుడికి సైతం విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాలని మోదీ సంకల్పించారు. ఆ దిశగా ముందుకెళ్తున్నాం ఆకాశమే మన హద్దు అని అన్నారు.













