టీఆర్ఎస్లోకి ఉమామాధవరెడ్డి?
మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడటం ఖాయమైనట్లు తెలిసింది. భువనగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె, తన అనుచరవర్గంతో కలిసి టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్‌పై సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో టీఆర్ఎస్లో చేరేందుకు ఆమె సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, కేసీఆర్ సూచన మేరకు ఉమ చేరిక అంశంపై భువనగిరి ఎమ్మెల్యేల పైళ్ల శేఖర్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డితో మంత్రి జగదీశ్‌రెడ్డి సమావేశమై అభిప్రాయాలు స్వీకరించినట్లు సమాచారం. మరోవైపు భునవగిరి నియోజకవర్గంలోని ముఖ్య అనుచరులతో ఇప్పటికే సమాలోచనలు జరిపిన ఉమ, మెజార్టీ నాయకులు టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. అయితే మరోసారి సమాలోచనలు జరిపిన తర్వాతే ఆమె టీఆర్ఎస్లో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.













