ఇద్దరే మహానుభావులు ..చరిత్రలో నిలబడిపోయారు : కేటీఆర్
దశాబ్దాల చరిత్రలో ఎంతో మంది రాజకీయ పార్టీలు పెట్టినా, ఎన్నో ప్రయత్నాలు చేసిన ఇద్దరే మహానుభావులు (ఎన్టీఆర్, కేసీఆర్) చరిత్రలో నిలబడిపోయారు అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ హిస్టరీ క్రియేట్ చేశారు. కేసీఆర్ హిస్టరీతో పాటు జాగ్రఫీని కూడా క్రియేట్ చేశారని ప్రశంసించారు. అన్ని రాష్ట్రాలకు సీఎంలు ఉంటారు. కానీ మన తెలంగాణకు రాష్ట్రానికి సాధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది గొప్ప విషయమన్నారు. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి ఈ రాష్ట్రాన్ని సాధించారు. అలాంటి వ్యక్తికి అవకాశం ఇస్తే ప్రభుత్వం కొలువుదీరింది. ఆ ప్రభుతంలో తనకు మంత్రిగా అవకాశం వచ్చిందని అన్నారు.
తెలంగాణను భారతదేశానికి దిక్సూచిగా మార్చారు అని కొనియాడారు. అవినీతి రహితంగా తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. 75 ఏండ్ల స్వాతంత్య్రంలో ఎంతో మంది ప్రధానులు, ముఖ్యమంత్రులు ఆకుపచ్చ రుమాలు మెడలో వేసుకున్నవారే. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక రైతుబంధు అనే గొప్ప పథకం ప్రవేశపెట్టారు. మన రైతు బంధు కేంద్రానికి ప్రేరణ అయిందన్నారు. తెలంగాణలో మాత్రమే 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ కాలంలో పూర్తి చేశారు. నాలుగు దశాబ్దాల ఫ్లోరోసిస్‌ను నాలుగేళ్లలో ఆ సమస్యకు పరిష్కారం చూపామని అన్నారు.













