విజయ పరంపరను కొనసాగిస్తున్న టీఆర్ఎస్

అధికార టీఆర్‌ఎస్ విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆదివారం వెలువడ్డ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఘన విజయం సాధించారు. తాజాగా జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ తన విజయ పరంపరను కొనసాగిస్తూనే ఉంది.
సిద్దిపేటలో టీఆర్‌ఎస్ విజయం
సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. మొత్తం 43 వార్డులుండగా, టీఆర్‌ఎస్ 36 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ 1 వార్డులో, మిగితా ఐదు వార్డుల్లో ఇతరులు గెలుపొందారు. అయితే కాంగ్రెస్ ఇక్కడ ఖాతాయే తెరవలేదు. బీజేపీ మాత్రం ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది.
అచ్చంపేటలో టీఆర్‌ఎస్ ఘన విజయం
అచ్చంపేట మున్సిపాలిటీని కూడా టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డులకు గాను 13 స్థానాల్లో టీఆర్‌ఎస్, 6 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.
జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీల్లో కూడా…
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలను కూడా టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 27 వార్డులుండగా, 23 వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచారు. బీజేపీ 2, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచింది. కొత్తూరు మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులుండగా, 7 వార్డుల్లో గులాబీ పాగా వేసింది. కాంగ్రెస్ 5 వార్డుల్లో గెలిచింది.
ఖమ్మం కార్పొరేషన్ టీఆర్‌ఎస్‌కే
ఖమ్మం కార్పొరేషన్ లో కూడా టీఆర్‌ఎస్ పాగా వేసింది. మొత్తం 60 డివిజన్లుండగా, ఇప్పటి వరకూ టీఆర్‌ఎస్‌కు 33 స్థానాలు వచ్చాయి. ఇంకా 27 స్థానాల లెక్క తేలాల్సి ఉంది.