వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నపుడే.. కమిషన్ ఏర్పాటు
రాజ్యాంగం పనితీరును సమీక్షించేందుకు వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు కమిషన్ ఏర్పాటు చేశారని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, టీఆర్ఎస్ నేత వినోద్‌కుమార్ సూచించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గుర్తు చేసుకోవాలన్నారు. ప్రధానికి కొన్ని అంశాలపైనే అధికారం ఉంటుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఉన్న ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని నిర్వీర్యం చేసేందుకు మోదీ ప్రభుత్వం యత్నిస్తోందని, దీన్ని ఇక్కడి ప్రజలు గుర్తించాలన్నారు. బీజేపీను ఉత్తర భారతదేశ పార్టీగా ఆయన అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్రాలతో చర్చించకుండా నదుల అనుసంధానం చేపడతామని బడ్జెట్లో ఎలా పేర్కొంటారని ఆయన ప్రశ్నించారు. గోదావరి మిగులు జలాలు ఉంటే తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకు అనుమతివ్వడం లేదని ప్రశ్నించారు.













