నవంబర్ మొదటి వారంలో టీఆర్ఎస్ ప్లీనరీ : కేసీఆర్
మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర శాఖల పునర్నిర్మాణం వరకు సమావేశంలో చర్చించారు. అదేవిధంగా దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ చేయాల్సిన కృషిపై సీఎం కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ నవంబర్ మొదటి వారంలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. దళిత బంధుపై ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ప్రతిపక్షాల తప్పుడు విమర్శల్ని తిప్పికొట్టాల్సిందిగా పిలుపునిచ్చారు. దళితబంధును ఉద్యమంలా చేయాలన్నారు. వచ్చే నెల 2వ తేదీన ఢిల్లీలో తెలంగాణ భవన్కు శంకుస్థాపన చేసుకోబోతున్నట్లు తెలిపారు. దశలవారీగా సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. త్వరలోనే కొత్త జిల్లా అధ్యక్షులను నియమిస్తామని తెలిపారు.













