కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసే వరకు తమ ఆందోళన
తెలంగాణ రాష్ట్రం నుంచి బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ధాన్యం కొనుగోలుపై రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని టీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని రాజ్యసభలో ఎంపీ కే. కేశవరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ వద్ద టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుపై పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేయాలని డిమాండ్ చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. గత ఐదురోజుల నుంచి టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభలో ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదన్నారు.
దేశ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు విధానం ప్రవేశ పెట్టాలని, తెలంగాణ నుంచి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేదన్నారు. మోదీ ప్రభుత్వం పేదల, రైతు, కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, రైతులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని ఆరోపించారు.













