గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీల నిరసన
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన బిల్లు అశాస్త్రీయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. బిల్లు ఆమోదంలో అశాస్త్రీయం ఏముందో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వమే చాలా బిల్లులను చర్చించకుండానే ఆమోదిస్తున్నదని విమర్శించారు. ప్రధాని మోదీ అసందర్భంగా తెలంగాణ ఏర్పాటును ప్రస్తావించారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను ప్రధాని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సాక్షిగా ఏర్పాటైన రాష్ట్రంపై మోదీ వ్యాఖ్యలు సరికావన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కే. కేశవరావు, కవిత, రంజిత్ రెడ్డి, నామా నాగేశ్వరరావుతో తదితరులు పాల్గొన్నారు.













