తెలంగాణలో వడ్లు కొనం అంటే ఎలా?
రైతుల కోసమే టీఆర్ఎస్ మహా ధర్నా తలపెట్టిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇందిరాపార్కు వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యలో తలపెట్టిన మహాధర్నా ఏర్పాట్లను మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రైతుల పక్షాన కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే ఈ ధర్నా తలపెట్టినట్టు తెలిపారు. మేం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మాది ప్రజల పక్షం. రాష్ట్ర విభజన వేళ ఏడు మండలాలను ఏపీలో కలిపారు. దీంతో రాష్ట్రానికి ఏడాదికి రూ.1000 కోట్ల నష్టం వాటిల్లుతోందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే కేంద్రం తీరుపట్ల నిరసన తెలిపాము. దేశంలో అన్ని రాష్ట్రాలకూ ఒకే విధానం ఉండాలి. పంజాబ్‌లో పండిన ప్రతి గింజా కొంటారెందుకు? తెలంగాణలో కొనరెట్లా? రాష్ట్రానికో విధానం ఉంటుందా? పంజాబ్‌లో అన్ని వడ్లూ కొంటారు. తెలంగాణలో కొనం అంటే ఎలా? ఇది కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకోవడమే. వడ్లు కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే అని అన్నారు.













