కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల కల : వినోద్
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో తాము కేంద్రంపై మరోసారి ఒత్తిడి తెస్తామని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ప్రకటించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అనేది తెలంగాణ ప్రజల దశాబ్దాల కల అని, దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే మాత్రం మరో ఉద్యమం తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో మిగిలిన పార్టీల మద్దతు కూడా తీసుకునే అంశంలో తాము ఓ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నాలు చేయకూడదని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని ప్రకటించారు.
ఇక ఇదే విషయంపై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి కూడా మాట్లాడారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే విషయంలో అసెంబ్లీ ఓ తీర్మానాన్ని చేయాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోఅన్ని పార్టీలూ కలిసి ఈ అంశంపై ఢిల్లీకి వెళ్లి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం పార్టీలకతీతంగా అందరూ పోరాడాలని అన్నారు. విభజన బిల్లులో ఉన్న అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని చాడ మండిపడ్డారు.













