బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ తన అనుచరులతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ తనకు టికెట్ కేటాయించకపోవడంపై తీవ్ర అసంతృప్తికి గురైన ఆమెను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమెకు పార్డీ కుండువా కప్పి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శోభ మాట్లాడుతూ గత 70 రోజులుగా ఎదురు చూసినా ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను రాజకీయ సమాధి చేయడం కోసం 70 రోజులు ఆపారని ధ్వజమెత్తారు. ప్రజల్లో బతుకుతున్న తనకు టికెట్ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మళ్లీ అసెంబ్లీకి పంపాలని కోరారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలే తీర్పు ఇవ్వాలన్నారు. పార్లమెంట్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కావాలని కవిత కోరుతున్నారని, టీఆర్ఎస్లో కవిత ఒక్కరే ఉంటే సరిపోతుందా, వేరే మహిళలు ఉండొద్దా? అని ప్రశ్నించారు. దళిత వర్గాలను రాజకీయంగా ఎదగకుండా కేసీఆర్ అడ్డుకున్నారని విమర్శించారు.













