బిఆర్‌ఎస్‌తోనే ఇక కేసీఆర్ పయనం
తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చోటుచేసుకుంది. జాతీయ రాజకీయాల్లో ప్రవేశానికి వీలుగా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు టీఆర్ఎస్ను బీఆర్ఎస్(భారత్ రాష్ట్ర సమితి)గా మారుస్తూ సంతకం చేశారు. ఈ తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు. పార్టీ పేరును బీఆర్ఎస్గా సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. టీఆర్ఎస్ స్థానంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావించింది. జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్ఎస్ అవతరించింది. పార్టీ సర్వసభ్య సమావేశంలో పార్టీ జెండా, ఎజెండాపై టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ వివరించారు. అంతకుముందు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ ఆ పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని సమావేశం ముందు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రవేశపెట్టారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు బలపర్చారు. ఈ భేటీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. జెడ్పీ చైర్మన్లు సహా 283 మంది ప్రతినిధులు హాజరైనారు. టీఆర్ఎస్ పేరు మార్పుపై తీర్మానం చేశారు. అనంతరం సంతకాలు సేకరించారు.













