ఈరోజు నా జీవితంలో నేను చేసిన గొప్ప పని
ఈరోజు తన జీవితంలో గొప్ప పని చేశానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైతుబంధు, జీవిత బీమా పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా రైతు బీమాపై ఎల్ఐసీ- ప్రభుత్వం మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎల్ఐసీ ప్రపంచంలోనే పెద్ద సంస్థ, విశ్వసనీయత ఉన్న సంస్థ అని కొనియాడారు. 57 లక్షల మంది రైతులకు జీవిత బీమాతో లబ్ది చేకూరుతుందని తెలిపారు. రైతు మరణిస్తే 10రోజుల్లోపు రూ.5 లక్షల బీమా అందుతుందని అన్నారు.
రైతుబంధు పథకంపై 89 శాతం మంది ప్రజలు సంతృప్తితో ఉన్నారన్నారు. రైతులను ఆదుకోవడం కోసమే రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలవుతుందన్నారు. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు రైతులందరికీ బీమా వర్తిస్తుందన్నారు. రైతు సమస్యలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణలో చెరువులన్నీ నీటితో కళకళలాడాలన్నదే తమ కల అని చెప్పుకొచ్చారు. వానల కోసం రైతులు ఎదురుచూడాల్సిన పనిలేదని, 365 రోజులూ చెరువులు నింపుతూనే ఉంటామని అన్నారు. బోరుబావులపై ఆధారపడే పరిస్థితిని పోగొడతామన్నారు. 2019 వరకు కాళేశ్వరం పూర్తవుతుందని సృష్టం చేశారు. తెలంగాణలో విద్యుత్ కొరతను తీర్చామని అన్నారు.













