పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో పీవీ కూతురు..
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అరుదైన గౌరవం ఇచ్చారు. పీవీ కూతురు.. విద్యావేత్త, చిత్రకారిణిగా గుర్తింపు పొందిన సురభి వాణీదేవిని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. వాణీదేవి స్వస్థలం కరీంనగర్ జిల్లా వంగర గ్రామ. ఆమె విద్యాభ్యాసం, వృత్తిజీవితం మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే సాగింది. 1986లో జేఎన్టీయూ నుండి డిప్లామా ఇన్ ఫైన్ ఆర్ట్స్‌లో పట్టాపొందారు. విద్యావేత్తగా చిత్రకారిణిగా, సంఘ సేవకురాలిగా ఆమెకు మంచి గుర్తింపు ఉన్నది.
35 ఏండ్లుగా వందల పెయింటింగ్స్ వేసిన వాణీదేవి.. తన పెయింటింగ్స్‌తో ఇప్పటివరకు 15 ఎగ్జిబిషన్లు నిర్వహించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉన్న గాంధీ మెమోరియల్ సెంటర్లో సారే జహాసే అచ్చా పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహించి రికార్డు సృష్టించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయంతో టీఆర్ఎస్ విజయావకాశాలు మరింత పెరిగాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పీవీకి జనాదరణ ఉన్న నేపథ్యాన్ని కూడా పలువురు ప్రస్తావిస్తున్నారు.













