మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ పేరు మారుతుందా?
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ సెంటిమెంటుకే ఓటేసింది. ఈ ఎన్నికల్లో పార్టీకి కొత్తగా పెట్టిన బీఆర్ఎస్ పేరుతో కాకుండా. పాత పేరు టీఆర్ఎస్ తోనే పోటీ చేయనుంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ వెల్లడించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులను కలిసిన తరువాత వినోద్ కుమార్ ఈ విషయాన్ని చెప్పారు. బీఆర్ఎస్ను కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తించడానికి కొంత సమయం పడుతుందని చెప్పిన ఆయన.. రేపటి నుంచే మునుగోడులో నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి టీఆర్ఎస్ పేరుతోనే మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. పార్టీ ఎన్నికల గుర్తు కారే ఉంటుందని, అందులో ఎటువంటి మార్పూ ఉండదని అన్నారు. వ్యక్తి పేరు మార్చినట్లే పార్టీ పేరు మార్చామన్నారు. మిగతావన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయన్నారు. బీఆర్ఎస్ను ఎన్నికల కమిషన్ గుర్తించేంత వరకూ టీఆర్ఎస్ పేరే కొనసాగుతుందని వినోద్ కుమార్ వివరించారు. దీంతో మునుగోడు ఎన్నికల్లో పార్టీ పేరు మారుతుందా? అనే సస్పెన్స్‌కు తెరపడింది.













