టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన పీజేఆర్ కుమార్తె
దివంగత పి.జనార్దన్ రెడ్డి (పీజేఆర్) కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పీజేఆర్ పేరు తెలియని వారు ఉండరని, పేదలకు పెద్దన్న పీజేఆర్ అని అన్నారు. హైదరాబాద్‌లో ఎన్నో బస్తీలు ఆయన కృషితోనే వెలిశాయని, ప్రజల కోసం సొంత పార్టీని కూడా నిలదీయడానికి పీజేఆర్ నెనుకాడలేదని అన్నారు. పీజేఆర్ లేని లోటు తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది. బస్తీ ప్రజల పక్షాన పోరాడేందుకు నాయకత్వం అవసరం. అందుకోసమే విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో పేద ప్రజల పక్షాన పోరాడే దళపతి మాకు దొరికింది. విజయారెడ్డికి పార్టీలో మంచి గౌరవం దక్కుతుంది అని అన్నారు.
విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. పీజేఆర్ కుతురుగా విజయారెడ్డికి మంచి భవిష్యత్ ఉంది. ఖైరతాబాద్ సహా ఎక్కడ పోటీ చేసినా ఆమె గెలుస్తుంది. కాంగ్రెస్ గెలిపించుకుంటే పీజేఆర్‌కు నిజమైన నివాళి అన్నారు. ఖైతరాబాద్ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని విజయారెడ్డి అన్నారు. పార్టీ మారడం ఒక్క రోజు తీసుకున్న నిర్ణయం కాదని, ప్రస్తుత దేశంలో, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడిరదన్నారు. కాంగ్రెస్ మాత్రమే పేదలకు న్యాయం చేస్తుంది. అందువల్లే సోనియా, రాహుల్ నాయకత్వంలో పని చేయడానికి వచ్చాను. నేను పదవుల కోసం పార్టీ మారలేదు. ఇక 3 రంగుల జెండా వదలను. నాది ఇక ఒకటే జెండా.. ఒకటే బాట అని స్పష్టం చేశారు.













