రాజగోపాల్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలి.. ఎన్నికల అధికారికి టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని, ఎన్నికల బరిలో నిలబడనీయకూడదని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేశారు. వేల కోట్ల ప్రాజెక్టు తీసుకొని బీజేపీలో చేరినట్లు స్వయంగా చెప్పిన ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌ను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల అధికారిని కలిసిన వారిలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, పార్టీ జనరల్ సెక్రటరీలు శ్రీనివాస్‌రెడ్డి, సోమ భరత్ తదితరులు ఉన్నారు. ఎన్నికల అధికారితో సమావేశం తర్వాత వీరంతా మీడియాతో మాట్లాడారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్టి ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తాను రూ.18 వేల కోట్ల ప్రాజెక్టు తీసుకొని బీజేపీలో చేరినట్లు చెప్పుకున్న విషయాన్ని ఈ నేతలు గుర్తు చేశారు. అలాంటప్పుడు రాజగోపాల్ రెడ్డిని అసెంబ్లీ బైపోల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి మెమోరాండం సమర్పించినట్లు టీఆర్ఎస్ నేతలు తెలిపారు.













