ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ దూకుడు
ఎక్కడ దూకుడు ప్రదర్శించాలో… ఎక్కడ తగ్గాలో బాగా తెలిసిన నాయకుడు కేసీఆర్ ఒక్కడే అని చెప్పవచ్చు. అవసరమైనప్పుడు తగ్గడం, అవసరమైనప్పుడు దూకుడుతనం ప్రదర్శించడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణను తెచ్చుకోవడంలో అవసరమైన చోట కాళ్ళబేరానికి కూడా ఆయన దిగారని చెబుతారు. తెలంగాణ వచ్చేసిన తరువాత వారితోనే తెగబడటం కేసీఆర్‌కే సాధ్యమైందని అంటారు. ఎన్నికల సమయం రావడంతోనూ 4 ఏళ్ళు దాటినా కూడా ఆంధ్ర సెంటిమెంట్‌ను మరోసారి రగిల్చి విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే తన ప్రచార సభల్లో ఆంధ్రులపై ముఖ్యంగా చంద్రబాబుపై దూకుడుగా తిట్ల పురాణం ఎత్తుకోవడం ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించడం, ఎన్నికల ప్రచారానికి విపక్షాలు రెడీ అవకముందే ఎన్నికల ప్రచారరంగంలోకి దిగి దూసుకుపోవడం ఆయనకు మాత్రమే సాధ్యమైంది.
తెలంగాణ తేవడంలోనూ, అధికారాన్ని తెచ్చుకోవడంలోనూ ఆయన రూటే వేరు. ఎప్పుడు ఎలాంటి వ్యూహం అనుసరిస్తాడో ఆయన పక్కన ఉన్న మంత్రులకు కూడా తెలియదు. చివరకు ఎవరూ ఊహించని విధంగా అసెంబ్లీని రద్దు చేసి అందరినీ మాజీలు చేశారు. సాధారణంగా ఇలాంటి వ్యవహారంలో ఎంతో దూరదృష్టితో వ్యూహంతో ముందుకెళితేనే అన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయి. కాని ఎక్కడైనా తేడా వస్తే ఉన్న అధికారం కూడా పోయి మాజీగానే కూర్చోవాల్సి వస్తుంది. కాని అన్నీ తాను అనుకున్నట్లుగా జరుగుతుందన్న ధీమానే ఆయనను అసెంబ్లీని రద్దు చేసేలా చేసిందని చెబుతారు. అసెంబ్లి రద్దు గురించి ముందే ఊహించినా అసెంబ్లి అభ్యర్ధుల జాబితా గురించి మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. అంకురా ర్పణగా పదో పదిహేనో పేర్లతో తొలి జాబితా విడుదల కావచ్చన్న సంకేతాలు వచ్చాయి. అలాగే 70-80 మంది పేర్లు ప్రకటించొచ్చని మరో సందర్భంలో వినిపించింది. ఎన్నికలకు ఇంత ముందుగా అన్ని పేర్లు ప్రకటించడం ద్వారా తలనొప్పుల్ని కొనితెచ్చుకునే ప్రయత్నం కేసీఆర్ చేయరని తెరాస శ్రేణులే ఆలోచన చేశాయి. అయితే అందరి అంచనాలకు భిన్నంగా ఆయన ఏకంగా 105 సీట్లకు అభ్యర్ధుల పేర్లు ప్రకటించారు. పద్నాలుగు చోట్ల తప్ప మిగతా అన్నిచోట్లా సిట్టింగుల పేర్లే ప్రకటించారు. అందుకే ఇది కూడా సాహసోపేతమైన చర్య అయింది. సిట్టింగులకే ఇచ్చారు కాబట్టి ఇదేమంత పెద్ద కసరత్తు కాదనిపిస్తుందిగాని నిజానికి ఆయన కొద్ది వారాలుగా దీనిమీద లోతైన తీవ్రమైన కసరత్తే చేశారు.
మొదటి నుంచీ కేసీఆర్ ఒక సంచలనంగానే రాష్ట్ర రాజకీయాల్లో నిలబడ్డారు. ముఖ్యమంత్రి అయిన క్షణం నుంచీ ఆయన తీసుకున్న వివిధ సంచలనాత్మక నిర్ణయాలు యావత్ దేశం దష్టిని ఆకర్షించాయి. ప్రజల సంక్షేమానికి ఇప్పటిదాకా ఆయన ప్రకటించిన పథకాలు కూడా ఆయన విస్త తస్ధాయి ఆలోచనావిధానానికి అద్దం పట్టాయి. ఏది చేసిన కనీస స్ధాయిలో చేయడం కాకుండా గరిష్టస్ధాయిలో చేయడమే తన విధానంగా మలుచుకున్న కేసీఆర్ పథకాల రూపకల్పనలో ఇంతవరకు ఏ ఇతర ముఖ్యమంత్రీ చేయని ఆలోచనలు ఆయన చేసినట్టు ఇప్పటికే నిరూపించుకున్నారు. అయితే అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే కేసీఆర్ చంద్రబాబుపై, ఆంధ్రులపై తిట్ల పురాణం చేయకుండా ఉండి ఉంటారని, అయితే ఎక్కడో తేడా వచ్చినందువల్లే చంద్రబాబుపై ఆయన దాడికి దిగారని అంటున్నారు.
ఏదీ ఏమైనా కేసీఆర్ లాంటి రాజకీయ వ్యూహచతురునితో తలపడాలంటే విపక్షాలకు కలిసికట్టుగా పోరాడితే కానీ విజయం సాధించలేమని అర్థం అవడంతో మహకూటమిగా ఏర్పడటం ద్వారా కేసీఆర్‌ను అధికారంలోకి రాకుండా నిలువరించేం దుకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, కోదండరామ్ వంటి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ మహకూటమి ఏర్పాటు వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యూహం ఉందని తెలియడంతో కేసీఆర్ చంద్రబాబుపై తిట్లపురాణం ఎత్తుకున్నాడని అర్థమవుతోంది. దానికితోడు విపక్షాలు కలిసికట్టుగా పోరాడితే తన ఓటు బ్యాంక్‌కు ఇబ్బంది పడుతుందన్న అనుమానాలు రావడంతో వారిని కలవనీయకుండా ఉండటానికే ఆంధ్ర సెంటిమెంట్‌ను మరోసారి కేసీఆర్ ఎత్తుకున్నారని తెలుస్తోంది.
టీడీపీతో పొత్తు కారణంగా తమకు కలిసివచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉంది. మరోవైపు రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లాంటి జిల్లాల్లో సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ టీడిపి మధ్య పొత్తు ఈ ఓట్లు ఆయా పార్టీలకే వెళుతాయని ఇది తమ పార్టీకి ఇబ్బందిని కలిగించవచ్చని కేసీఆర్ భావించారు. దాంతో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా తన ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవాలని ఆయన భావిస్తున్నారు. తెలంగాణను సర్వనాశనం చేసిన బాబుతో పొత్తు పెట్టుకొన్న కాంగ్రెస్‌ను గెలిపించి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా అంటూ కేసీఆర్ సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేశారు. ఇంత కాలంపాటు చేసిన పోరాటం ఇక వధాగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. దాంతోపాటు చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో తెలంగాణను సర్వనాశనం చేశాడన్నారు. అలాంటి పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని తెలంగాణను బాబుకు తాకట్టు పెట్టిందని విమర్శళకు దిగారు. ఓవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక్కడ ఉన్న ఆ పార్టీ నాయకులు స్వయంగా నిర్ణయాలు తీసుకొనే పరిస్థితి ఉండదన్నారు. ఏ నిర్ణయమైనా ఢిల్లీకి వెళ్లాల్సిందేనని కేసీఆర్ ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం గులాంగిరికి పరాకాష్టగా ఆయన అంటూ ఆ కూటమిని గెలిపించవద్దని పరోక్షంగా హెచ్చరించారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ దూకుడుగా వ్యవహరించి పార్టీకి అధికారాన్ని తెచ్చిపెట్టేందుకు మరోసారి ప్రయత్నిస్తున్నారు.













