మునుగోడు ఉపఎన్నిక…ప్రచారంలో టీఆర్ఎస్, బిజెపిలు ముందంజ
మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్. పార్టీ గెలుపుకోసం ముఖ్యమంత్రితోపాటు ఇతర మంత్రులంతా గెలుపు వ్యూహాలతో ముందుకెళుతున్నారు. మరోవైపు ఈ నియోజకవర్గం నుంచి బిజెపి తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపుకోసం బిజెపి ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా ప్రచారపర్వంలోకి దూసుకెళ్ళలేదు. టీఆర్ఎస్, బీజేపీలు తమ బలాలను ఇప్పటినుంచే పూర్తిస్థాయిలో వినియోగించుకునే పనిలో నిమగ్నమై ఉండగా, కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకా తమ ప్రచారాన్ని ముమ్మరం చేయలేదు.
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల నడుమే పోరు సాగనుంది. ఇది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో పాటు ఆ పార్టీకి కేడర్ కూడా బాగానే ఉంది. కానీ ఇతర పార్టీలు దూకుడుగా వెళుతున్న నేపథ్యంలో ఉన్న కేడర్ నిస్తేజంలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడిరది. ఇదే అదనుగా టీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు గాలం వేసి తమ శిబిరాల్లో చేర్చుకుంటున్నాయి. కాంగ్రెస్ వార్డు సభ్యుల నుంచి మండల పార్టీ అధ్యక్షులు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, మున్సిపల్ పరిధిలోని నాయకులు టీఆర్ఎస్, బీజేపీల్లో ఏదో ఒక పార్టీలో చేరిపోతున్నారు. ఆలస్యం చేస్తే ప్రయోజనం ఉండదనే భావన స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్లో కనిపిస్తుండడంతో ప్రతిరోజూ వలసల పర్వం కొనసాగుతోంది.
టీఆర్ఎస్ పక్షాన జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తూ పార్టీని ముందుకు తీసుకెళుతున్నారు. ఇప్పటికే పార్టీ సింబల్, కేసీఆర్ బొమ్మలున్న గోడ గడియారాలు, గొడుగులు నియోజకవర్గానికి చేరిపోయాయి. వీలున్నంత మేరకు ఇతర పార్టీల నేతలను చేర్చుకున్న ఆ పార్టీ.. ఇప్పుడు గ్రామాల అభివృద్ధి నిధుల ఖర్చుపై దృష్టి పెట్టింది. గ్రామానికి రూ.20 లక్షల చొప్పున నిధులు రానున్న నేపథ్యంలో గ్రామపంచాయతీల చేత తీర్మానాలు చేయించి ప్రతిపాదనలు కూడా పంపించారు. 2, 3 రోజుల్లో నిధులు వస్తాయని, పనులు కూడా ప్రారంభం అవుతాయనే చర్చ జరుగుతోంది.
బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా తనదైన శైలిలో నియోజకవర్గాన్ని చుట్టుముడుతున్నారు. పాత కాంగ్రెస్ కేడర్‌తో పాటు తనకున్న వ్యక్తిగత చరిష్మాను ఉపయోగించుకుంటూ.. పార్టీలో చేర్చుకున్న నేతలతో కలిసి రోజుకో గ్రామానికి వెళుతున్నారు. మరోవైపు బీజేపీ, టీఆర్ఎస్ ఇప్పటికే నియోజకవర్గంలో బహిరంగసభలు కూడా నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు గ్రామాలు, మండలాల్లో ఉత్తేజంగా తిరుగుతుండగా, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల్లో చురుకుదనం లోపించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.













