సీఎం కేసీఆర్ కు ఉత్తమ్ శుభాకాంక్షలు
ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్‌కు మంత్రి కేటీఆర్ తెలంగాణకు గుడ్‌బై చెప్పి అమెరికాకు వెళ్లిపోతారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓడిపోతే ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకుంటానని అన్నందుకు కేసీఆర్‌ను తాను అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. అధికారంలోకి వచ్చేది ప్రజాకూటమేనని అన్నారు. రాష్ట్ర సాయి నుంచి గ్రామస్థాయి వరకు టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ తీరు పట్ల విసిగెత్తిపోయి ఉన్నారని అన్నారు. కేసీఆర్ కేవలం తన కుటుంబం కోసం, తన కుమారుడి కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. తన కుటుంబం బాగుపడడానికే తెలంగాణ ఏర్పడినట్లు భావిస్తున్నారని విమర్శించారు. అలాంటి కుటుంబ పాలన నుంచి విముక్తి పొందడానికి ఇదే సరైన సమయమని, అలాంటి వారందరికీ తాము ఆహ్వానం పలుకుతున్నామని అన్నారు. ఈ ఎన్నికలు టీఆర్ఎస్ కుటుంబం, ప్రజలకు మధ్యే జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఓ టీఆర్ఎస్ ప్రముఖ నేత కాంగ్రెస్‌లో చేరబోతున్నారని తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు వెల్లడించారు.













