ఆ ఘనత సోనియాదే … ఉత్తమ్

ఆరున్నర దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆంకాంక్షను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన గాంధీభవన్‍లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడేళ్ల కాలంలో తెలంగాణ ప్రజల ఆంకాంక్షకు అనుగుణంగా పాలన సాగడం లేదన్నారు. విభజన హామీలను కేంద్రంలోని బీజేపీని అడిగే ధైర్యం కేసీఆర్‍కు లేదన్నారు. కొవిడ్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం చెందాయన్నారు. మెడికల్ మౌళిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. రోమ్ తగలబడుతుంటే. నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించిన చందంగా కేసీఆర్ తీరు ఉందని విమర్శించారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఇచ్చినందుకు సోనియాగాంధీకి ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
ఉద్యోగ ఖాళీలను భర్తి చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతిపై ప్రభుత్వంలో స్పందన లేదన్నారు. రాష్ట్రంలో అవినీతి తారస్థాయికి చేరిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ వీహెచ్, సీనియర్ నేతలు మధుయాష్కీ, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.