పెట్టుబడిదారుల కోసం.. కొత్త రాజ్యాంగం కోరుతున్నారా? : రేవంత్
కేంద్ర బడ్జెట్తో శ్రీమంతులకే ప్రయోజనమని, పేదలకు ఎలాంటి లాభం లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మీడియా సమవేశంలో చిత్రవిచిత్రంగా మాట్లాడారని విమర్శించారు. కేసీఆర్ మాటలు బాధ్యతారహితంగా ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి కేసీఆర్ అడగలేదు. కొత్త రాజ్యాంగం తేవాలనే కేసీఆర్ ప్రతిపాదన విచిత్రం. భూస్వాములు, పెట్టుబడిదారుల కోసం కొత్త రాజ్యాంగం కోరుతున్నారా? బీజేపీ ఆలోచనలనే ఇక్కడ కేసీఆర్ ప్రతిపాదిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బీజేపీ యోచన. రిజర్వేషన్ల రద్దు కోసం బీజేపీ కొన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. బీజేపీ తన ఆలోచనను కేసీఆర్ ద్వారా ప్రతిపాదిస్తోందని రేవంత్ ఆరోపించారు.
బీజేపీ రాజ్యాంగం రద్దు కుట్రకు కేసీఆర్ మద్దతు తెలిపారని ఆరోపించారు. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహం ముందు కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్దం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ రాజ్యాంగం రద్దు ఆలోచనను ఉపసంహరించుకునేందుకు రెండు రోజుల పాటు గాంధీ భవన్లో నిరసన దీక్షలు చేపట్టనున్నట్టు తెలిపారు. రాజ్యాంగం రద్దు ఆలోచనను ఉపసంహరించుకొకపోతే దేశ యువత కేసీఆర్ నాలుక కొస్తారని హెచ్చరించారు.













