కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. నిర్మల్ జిల్లాను
తెలంగాణ ప్రజలకు ఏకైక నాయకురాలు సోనియాగాంధీ, తెలంగాణ ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతగా రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలో తీసుకురావాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నిర్మల్‌కు చెందిన శ్రీహరిరావు పార్టీలో చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ పార్టీలోకి వచ్చిన శ్రీహరిరావుకు సాదర స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. పార్టీ గెలుపుకోసం పనిచేసే వారికి గుర్తింపు లభిస్తుందన్నారు. నిర్మల్ జిల్లా నుంచి కాంగ్రెస్ కుటుంబంలో చేరిన వారికి సముచిత గౌరవం దక్కుతుంది. కొందరు పార్టీని వీడితే నాయకులే ఉండరన్నట్టు వ్యవహరించారు. కానీ అంతకంటే బలమైన నాయకులు పార్టీలోకి వచ్చారు. కచ్చితంగా నిర్మల్ అసెంబ్లీలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తుంది.
కొడంగల్‌లో గెలవడం ఎంత ముఖ్యమో నిర్మల్ నియోజకవర్గంలో గెలవడం అంతే ప్రాధాన్యతగా తీసుకుంటాం. ఇంద్రకరణ్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. ఏ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇట్లు కటించారో ఆ గ్రామంలోనే బీఆర్ఎస్ ఓట్లు అడగాలి. ఇందిరమ్మ ఇల్లు కట్టిన ప్రాంతాల్లో మేం ఓట్లు అడుగుతాం. ఇందుకు ఇంద్రకరణ్ రెడ్డి సిద్దమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ మోసాన్ని భరించే ఓపిక తెలంగాణ ప్రజలకు లేదు. తెలంగాణ సమాజం తిరగబడే సమయం ఆసన్నమైంది. కేసీఆర్ చేతిలో మోసపోయిన వారి జాబితాలో శ్రీహరిరావు మొదట్లో ఉంటారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మల్ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాం. ఆదిలాబాద్ జిల్లాలో 10కి 8 సీట్లు గెలిపించుకోవాలి. తెలంగాణలో ఒక నిశ్శబద్ద విప్లవం, ఒక తుపాన్ రాబోతోంది. నాయకులు గ్రామాల్లోకి వెళ్లి ప్రతి గుండెకు చేరాలి అని అన్నారు.













