ఈ ఉద్యమంలో అందరు పాల్గొనాలి : రేవంత్ రెడ్డి
అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో ఉద్యమం చేపడతామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాతో సీఎం కేసీఆర్ పాలనలో ఆయా వర్గాలు ఎలా దగాకు గురయ్యాయో చెప్పాలన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కలలు నెరవేరలేదని ఆరోపించారు. 2014లో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం అంటూ హామీలు ఇచ్చారన్నారు.
టీఆర్ఎస్ పాలనలో ఉపాధ్యాయుల నియామకాలు జరగలేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో పేద విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారి చావులకు కేసీఆర్ మాధ్యత అని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి హామీ అమలు కాలేదు. ప్రతి నిరుద్యోగికి సీఎం రూ.లక్ష బాకీ పడ్డారు. తెలంగాణ ఏర్పడినపుడు ఉన్న ఖాళీల కంటే ఇప్పుడు పెరిగాయి. రాష్ట్రంలో 1.9 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ చేపట్టే ఈ సైరన్ ఉద్యమాన్ని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో చేపడతాం. ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు ప్రతి విద్యార్థి, నిరుద్యోగులు కలిసి రావాలన్నారు. తెలంగాణ సమాజం మా ఉద్యమాన్ని ఆశీర్వదించాలని కోరారు.













